కర్ణాటక బీదర్ ప్రాంతంలో కనీవినీ ఎరుగని దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక బీదర్ ప్రాంతానికి తన స్నేహితులతో కలిసి మరో మిత్రుడిని కలవడానికి వచ్చిన ఇంజనీరుని కిడ్నాపర్‌గా భావించి అతనిపై స్థానికులు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఆక్సెంచర్ కంపెనీలో గూగుల్ ప్రాజెక్టు మీద పని చేస్తున్న మహ్మద్ ఆజామ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి.. బీదర్ ప్రాంతానికి చెందిన మరో మిత్రుడి ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కి హాజరయ్యాడు. ఫంక్షన్ పూర్తయ్యాక ఈ నలుగురు స్నేహితులు హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమవుతూ.. దాహం తీర్చుకోవడానికి మార్గమధ్యంలో ఓ షాపు వద్ద ఆగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ షాపు వద్ద కొందరు పిల్లలకు ఆజామ్ స్నేహితుడు చాక్లెట్లు ఇవ్వగా.. అది చూసిన స్థానికులు అతన్ని ప్రశ్నించారు. వారు పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లని అనుమానంగా ఉందని స్థానికులలో కొందరు డౌట్ వ్యక్తం చేయగా.. వారు సదరు స్నేహితులతో వాదనకు దిగారు. ఆ వాదన పెద్దదిగా మారుతుండడంతో.. ఆ గొడవ నుండి ఎలాగోలా బయటపడాలని భావించిన మిత్రులు.. జనాల నుండి తప్పించుకొని వాహనాన్ని బలవంతంగా రోడ్డుమీదకు పోనిచ్చారు. 


అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియోలను, స్నేహితులకు సంబంధించిన ఫోటోలను కొందరు గ్రామస్తులు వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేయగా.. ఆజామ్ నడుపుతున్న వాహనం గ్రామ సరిహద్దు దాటకముందే అనేకమంది వచ్చి వారిని చుట్టుముట్టారు. తర్వాత గ్రామస్తుల్లో కొందరు స్నేహితులపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటనలో ఆజామ్ మరణించగా.. మిగతావారు తీవ్ర గాయాల పాలయ్యారు.


ఈ దాడి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. పోలీసులు బాధితులను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఆ తర్వాత హైదరాబాద్‌కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఆజామ్ కుటుంబీకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఆ సంఘటనలో కిడ్నాప్ అనేది కేవలం కట్టుకథ అని.. అంతకుమించి వేరే విషయం ఏదైనా ఉండవచ్చని.. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని వారు కోరారు.


కాగా.. ఈ మధ్యకాలంలో వాట్సప్‌లో వస్తున్న ఫేక్ మెసేజ్‌ల వల్ల ఎన్నో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వాట్సాప్ సందేశాలను నిజమేనని నమ్ముతూ పలువురు విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారు. గత రెండు నెలలుగా ఈ రకమైన దాడులు గ్రామాల్లో పెచ్చుమీరుతున్నాయి. ఎలాంటి సమస్య ఉన్నా.. పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయమని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు కోరుతున్నా.. చాలామంది ఆ మాటలను పెడచెవిన పెడుతూ.. హింసను ప్రేరేపించడానికే ప్రయత్నిస్తుండడం గమనార్హం.


ఈ మధ్యకాలంలో వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న నకిలీ మెసేజ్‌లపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసి తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖలను కోరింది. వాట్సాప్ యాజమాన్యంతో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవసీకి సంబంధించిన అంశాలపైన చర్చించాలని యోచిస్తోంది.