హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ నేటి సాయంత్రం తెలంగాణ పర్యటనకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నగర శివార్లలోని మేడ్చల్‌లో జరిగే బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6గంటలకు మేడ్చల్‌లో జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 


ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సైతం సోనియా గాంధీ సభ తర్వాత పరిస్థితులు పార్టీకి మరింత అనుకూలంగా మారే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. సభలో పాల్గొని మాట్లాడిన అనంతరం రాత్రి 7గంటలకు ఆమె బేగంపేట విమానాశ్రయం ద్వారా అదే ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.