భద్రాద్రి: భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ముగిశాయి. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లఘ్నాన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకను జరిపించారు. మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంప్రదాయం ప్రకారం శ్రీరాముడు, సీతమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 


లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి పుణ్య, భోగభాగ్యాలను సొంతం చేసుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కార్ ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడంతో శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.