మద్యం షాపులు పెట్టుకోవడానికి లైసెన్స్ అందించే ప్రక్రియలో ఆహ్వానించిన టెండర్ దరఖాస్తుల అమ్మకంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఊహించని ఆదాయం లభించింది. దాదాపు నలభై వేల పైచిలుకు దరఖాస్తులు రావడంతో  తెలంగాణ ఖజానాకు  రూ.411.19 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది.  తెలంగాణలోని 2,216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ ప్రకటించగా,  ఒక్క షాపు మినహా దాదాపు అన్నింటినీ ఊహించని స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 41,119 దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక సమాచారం.


కొన్ని జిల్లాల్లో మద్యం షాపుల లైసెన్సులకు కొన్ని వందలమంది దరఖాస్తులు చేసుకోవడంతో  బుధవారం తెల్లారుజాము వరకు  స్వీకరణ ప్రక్రియ  కొనసాగిందని అధికారులు తెలిపారు. చివరి రోజే రాష్ట్రవ్యాప్తంగా 25,750 దరఖాస్తులు వచ్చాయి.అయితే దరఖాస్తు ఫీజును రెండింతలు పెంచడం కూడా ఈ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు . సాధారణంగా ఇలా వచ్చే దరఖాస్తులను లాటరీ పద్దతిలో ఎంపిక చేసి షాపులను ఆయా దరఖాస్తుదారులకు కేటాయిస్తారు. ఈనెల 22న నిర్వహించే లాటరీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.