తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మహాకూటమి గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి కూడా కొంచెంసేపు ప్రస్తావించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత రాష్ట్రాన్ని చక్కబెట్టుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. ఒకవేళ చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి సనత్ నగర్ నుండి ప్రచారం చేసినా.. తనకు లాభం గానీ నష్టం జరిగే అవకాశం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కచ్చితంగా ఈ సారి కూడా టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు గ్యారంటీ అని చెప్పిన తలసాని.. తాము ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటామని వస్తున్న వార్తలలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ విషయానికి వస్తే..ఆడలేక మద్దెల ఓడు అనే సామెత గుర్తుకు వస్తుందని.. కాంగ్రెస్ నేతలు ఓటర్ లిస్టుల అవకతవకల విషయంలో కోర్టు చుట్టూ తిరగడానికి సరిపోతుందని ఆయన దుయ్యబెట్టారు. ఇక కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయనకు ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం అలవాటని.. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని తెలిపారు. 


గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్యాటక, కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన తలసాని.. 2014 ఎన్నికల్లో సనత్ నగర్ నుండి పోటీ చేసి మళ్లీ తెలుగుదేశం పార్టీ నుండే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్లీ టీఆర్ఎస్‌లో చేరి.. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.