ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ టీడీపీ, బీజేపీ నేతలు అసెంబ్లీ వరకు నిసరన ర్యాలీ నిర్వహించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి, జొన్న, పత్తిని ప్రదర్శిస్తూ ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్‌ ఎల్బీస్టేడియం నుంచి అసెంబ్లీ వరకూ కొనసాగిన ఈ ర్యాలీలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యేలను అసెంబ్లీ వైపు అనుమతించిన పోలీసులు.. కార్యకర్తలను మాత్రం అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.