తెలంగాణలో ఉపాధ్యాయ నిరుద్యోగులకు శుభవార్త. వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు) నోటిఫికేషన్ ఎట్టకేలకు వచ్చేసింది. 8792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ అయిదు నోటిఫికేషన్లను వెలువరించింది. దాదాపు ఈ పరీక్షలకు నాలుగు లక్షల మంది హాజరవునున్నట్లు అంచనా. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1941 స్కూల్ అసిస్టెంట్లు, 416 పీఈటీలు, 1011 లాంగ్వేజ్ పండిట్లు, 5415 ఎస్‌జీటీ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటి నిమిత్తం 30 అక్టోబరు నుండి 30 నవంబరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2018 ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు. తెలంగాణలో 31 జిల్లాల ప్రాతిపదికిన ఈ పోస్టులు భర్తీ అవ్వనున్నాయి. అలాగే భాషా పండితులు, స్కూల్ అసిసెంట్లు, ఎస్జీటీ పోస్టులకు టెట్‌లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. అదేవిధంగా అభ్యర్థి స్థానికతను రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నిర్ణయించనున్నారు.