Telangana BJP Plan to GHMC Election: తెలంగాణలో కమలం పార్టీ వ్యూహాం మార్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉన్న క్యాడర్‌లో కొత్త జోష్‌ నింపేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కొద్దిరోజులుగా రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతోంది. అయితే సభ్యత్వ నమోదులో బీజేపీ నేతలు బాగా వెనుకబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వారిని యాక్టివ్‌ మోడ్‌లోకి తెచ్చేందుకు పార్టీ పెద్దలు మరో టాస్క్‌ అప్పగించినట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలంటే నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలుస్తోంది. దాంతో రంగంలోకి దిగిన కాషాయ నేతలు నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసి తమ గోల్‌ను రీచ్‌ అవ్వాలని భావిస్తున్నారట.. ఇందులో భాగంగా  హైడ్రా, మూసీ కూల్చివేతలు, ముత్యాలమ్మ ఆలయాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Road Accident: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఆరుగురు అక్కడిక్కడే మృతి..


ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా, మూసీలో కూల్చివేతలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తోంది. కానీ బీజేపీ మాత్రం మొన్నటివరకు స్పందించనే లేదు.. ఆ పార్టీలో కొందరు నేతలు మూసీ కూల్చివేతల్ని సమర్థిస్తే.. మరికొందరు నేతలు మాత్రం విమర్శించారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతలు తలోమాట మాట్లాడటంతో క్యాడర్ సైతం పరేషాన్ అయ్యింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పార్టీ పెద్దలు నేతలందరికీ తలంటినట్టు సమాచారం.. ఇకమీదట ఎవరైనా ప్రెస్‌మీట్‌ పెట్టాలని అనుకుంటే.. పార్టీ ఆఫీసులో ముందే ఎజెండా చెప్పాలని ఆదేశించినట్టు తెలిసింది. దాంతో కొందరు నేతలు బీజేపీ ఆఫీసులో ప్రెస్‌మీట్లు పెట్టకుండా మరోచోట కూడా ప్రెస్‌మీట్లు నిర్వహించడం నేతల మధ్య సఖ్యత లేదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్టైంది.. ప్రస్తుతం పార్టీ పెద్దల హెచ్చరికలతో నేతలు తమ వ్యూహాన్ని మార్చినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. 


గత కొద్దిరోజులుగా మూసీలో కూల్చివేతలపై బీజేపీ నేతలు వాయిస్ పెంచేశారు. కొందరు నేతలైతే నేరుగా బాధితులను కలిసి తమ సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో బిజెపి మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో రేవంత్ సర్కార్‌పై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. పేదల ఇళ్లను కూలుస్తున్న రేవంత్‌ రెడ్డి.. బడాబాబుల ఇండ్లను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా రేవంత్‌ అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు కిషన్‌రెడ్డి.


మరోవైపు పేదల కోసం ఎంతవరకైనా పోరాడతామని, అవసరమైతే రాష్ట్రాన్ని దిగ్భంధిస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీకి లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు కొత్తేం కాదన్నారు. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ ఏక్ నిరంజన్ పార్టీ.. అంతా ఒక్కడిగా నడిచింది. కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పెద్ద డ్రామా కంపెనీలా తయారైందన్నారు బండి సంజయ్.


అటు సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయంపై దాడిని పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దాడి ఘటనను నిరసిస్తూ.. హింధూ సంఘాలతో కలిసి ధర్నాకు దిగారు. అంతేకాకుండా.. అమ్మవారి ఆలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, గవర్నర్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. ఇలా అనేక అంశాలతో ప్రజల ముందుకు వెళ్లే యోచనలో కాషాయ నేతలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు త్వరలోనే గ్రేటర్‌లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.. ప్రతిరోజు ఏదో ఒక అంశంతో ప్రజల్లో ఉంటే భారీగా లబ్ధి పొందొచ్చని నేతల ఆలోచనగా ఉందట.. ఇటీవల గ్రేటర్ పరిధిలోని సొంత పార్టీ కార్పొరేటర్లతో సమావేశమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారితో ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారి దాదాపు ఏడాది కావొస్తోంది. అయితే ప్రభుత్వం మారిన పెద్దగా తేడా ఏమీ లేదని కమలం పార్టీ భావిస్తోందట. అందుకే గ్రేటర్‌ హైదరాబాద్‌పై కాస్తా ఫోకస్ పెంచితే జెండా ఎగురవేయ్యోచ్చని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారట. అటు గ్రేటర్‌ లో కాషాయ జెండా ఎగిరితే.. రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా విస్తరించవచ్చని పార్టీ పెద్దల ఆలోచనగా ఉందని కమలం నేతలు చెబుతున్నారు. 


Also Read: Ponguleti Srinivas Reddy: పొంగులేటి మార్క్ రాజకీయం.. ఖమ్మంలో ఆ పార్టీ నేతలకు బంపరాఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter