తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' ఉద్ధృతి తగ్గడంలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు 1085 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 29 మంది చనిపోయారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడగించకముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పొడగించారు. ఈ నెల 7 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు లాక్ డౌన్ విధిస్తూనే..  పాక్షిక సడలింపులతో కొన్ని కార్యకలాపాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.  దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తెలంగాణలో అమలు చేయడం లేదు. ప్రస్తుతానికి లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఎల్లుండి( గురువారం)తో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనుంది.ఈ క్రమంలో తెలంగాణ కేబినెట్ నేడు సమావేశం కానుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.


ఓ వైపు తెలంగాణలో జూన్ 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 


ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ జరగనుంది. లాక్ డౌన్ కొనసాగించాలా..? వద్దా..? కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మే 17 వరకే లాక్ డౌన్ అమలు చేయాలా..? ఒకవేళ లాక్ డౌన్ పొడగిస్తే.. ఎప్పటి వరకు పొడగించాలి..? అనే అంశాన్ని చర్చించనున్నారు. మరోవైపు కేంద్రం ఇచ్చిన సడలింపులను తెలంగాణలో అమలు చేయాలా..? వద్దా..? అనే దానిపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆంక్షలను సడలిస్తే ఎలాంటి పరిణాలు తలెత్తుతాయనే విషయాన్ని మంత్రివర్గం అంచనా వేయనుంది. మరోవైపు తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఇవాళ్టి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు చేయనున్నారు. రాష్ట్రానికి నూతన సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల అంశాలు సహా ఇతర అంశాలు చర్చకు రానున్నాయి..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.