Munugode Trs: మునుగోడు టీఆర్ఎస్ లో ట్విస్ట్.. టికెట్ రేసులో కర్నె, కంచర్ల? అసమ్మతి స్వరంతో కూసుకుంట్ల అవుట్..
Munugode Trs: మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీలో సెగలు రేపుతోంది. అసమ్మతి నేతల వరుస సమావేశాలతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది.మునుగోడులో పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించిన సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు.
Munugode Trs: మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీలో సెగలు రేపుతోంది. అసమ్మతి నేతల వరుస సమావేశాలతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినా అసమ్మతి నేతలు చల్లబడ లేదు. ఓ వైపు ఈనెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. మరోవైపు అసమ్మతి నేతలు తమ వాయిస్ మరింత పెంచారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ వస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి సంకేతాలు ఇవ్వడంతోనే అసమ్మతి నేతలు సమావేశమయ్యారని తెలుస్తోంది. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ఏడు మండలాలకు చెందిన అసమ్మతి నేతలు అల్టిమేటమ్ ఇవ్వడంతో మంత్రి జగదీశ్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గంలో జగదీశ్ రెడ్డి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మునుగోడులో పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించిన సీఎం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు. మునుగోడుకు సంబంధించి ఆయన ప్రగతి భవన్ లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మునుగోడు టీఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై ఎందుకంత వ్యతిరేకత ఉందని విషయంపై కేసీఆర్ ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. ఏడు మండలాలకు చెందిన నేతలు ఆయనను వ్యతిరేకిస్తుండటంతో అసలు ఏం జరిగిందన్న వివరాలు తెలుసుకుంటున్నారట కేసీఆర్. నియోజకవర్గంలో కూసుకుంట్లపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తాజాగా పీకే టీమ్ కూడా ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిందని సమాచారం. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కేసీఆర్ మరోసారి సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు టికెట్ రేసులో ఉన్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని ప్రగతి భవన్ కు పిలుపించుకున్నారు కేసీఆర్. కంచర్ల సోదరులతో కేసీఆర్ చర్చలు జరిపారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్న కృష్ణారెడ్డి ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులను కేసీఆర్ తెలుసుకున్నారని తెలుస్తోంది.
మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉండటంతో ఆ దిశగా సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో 67.5 శాతం బీసీ ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గ ఓటర్లు మరో 15 శాతం వరకు ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా నియోజకవర్గంలో బీసీ నినాదం వినిపిస్తోంది. పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కురువృద్దుడు జానారెడ్డిని ఓడించడంలో బీసీ వాదమే అధికార పార్టీకి కలిసివచ్చింది. అందుకే మునుగోడులోనూ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. మునుగోడు నుంచి బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్,భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. అయితే బూర నర్సయ్య గౌడ్ ను మరోసారి భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న కర్నె ప్రభాకర్ కు కేసీఆర్ చేయించిన సర్వేలో సానుకూల ఫలితాలు వచ్చాయంటున్నారు.ఇప్పటికే ఉద్యమకారులను కేసీఆర్ దూరం పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి, దీంతో మునుగోడు నుంచి కర్నె ప్రభాకర్ ను బరిలోకి దింపితే బీసీ వాదంతో పాటు ఉద్యమకారుడిని గుర్తించినట్లు అవుతుందనే భావనలో గులాబీ పార్టీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు కూడా కర్నె ప్రభాకర్ కు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని పార్టీ పెద్దలకు రాసిన లేఖలో తెలిపారని తెలుస్తోంది. మునుగోడుకు సంబంధించి టీఆర్ఎస్ లో తాజాగా జరుగుతున్న పరిణామాలతో టికెట్ రేసులో కర్నె ప్రభాకర్ ముందున్నారని సమాచారం. మరోవైపు కేసీఆర్ తో కంచర్ల సోదరులు భేటీ కావడంతో మునుగోడు టికెట్ కృష్ణారెడ్జికే వస్తుందనే ఆయన అనచరులు ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ లో నెలకొన్న తాజా పరిణామాలతో రెండు రోజులుగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మునుగోడు టికెట్ ఖరారైందని వస్తున్నప్రచారం నిజం కాదని తేలిపోయిందంటున్నారు.
Read Also: Telangana Survey: రోజురోజుకు తగ్గుతున్న కేసీఆర్ గ్రాఫ్.. కారుకు బ్రేకులేనా? తాజా సర్వేలో సంచలనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook