Munugode Byelection: ఎన్నికల షెడ్యూల్ రాకముందే మునుగోడుకు కేసీఆర్.. ఓటమి భయమా.. అసమ్మతికి చెక్ పెట్టడమా?
Munugode Byelection: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21న చౌటుప్పల్ లో జరిగే అమిత్ షా బహిరంగ సభలో కమలం గూటికి చేరనున్నారు.ఇప్పుడు అమిత్ షా సభకు ఒక రోజే ముందే మునుగోడుకు సీఎం కేసీఆర్ వస్తుండటం మరింత కాక రేపుతోంది.
Munugode Byelection: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఉప ఎన్నికను అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈనెల 21న చౌటుప్పల్ లో జరిగే అమిత్ షా బహిరంగ సభలో కమలం గూటికి చేరనున్నారు. మునుగోడులో నిర్వహించనున్న సభకు అమిత్ షా రానుండటం చర్చగా మారితే.. ఇప్పుడు అమిత్ షా సభకు ఒక రోజే ముందే మునుగోడుకు సీఎం కేసీఆర్ వస్తుండటం మరింత కాక రేపుతోంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా చేసి 10 రోజులు కూడా కాలేదు. అయినా సీఎం కేసీఆర్ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటం చర్చగా మారింది. కేసీఆర్ టూర్ తో కొత్త చర్చలు వస్తున్నాయి.
ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలను తనకు అస్త్రంగా మలుచుకున్న కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాకా ఉప ఎన్నికలను పెద్దగా పట్టించుకోరు. దుబ్బాక ఉప ఎన్నికలో ఆయన ప్రచారం చేయలేదు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలో ప్రచారం చేశారు. అక్కడ కారు పార్టీ గెలిచింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. అయినా గులాబీ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే నాగార్జున సాగర్, హుజురాబాద్ లో ఎన్నికల పోలింగ్ కు కొన్ని రోజుల ముందే ప్రచారం చేశారు కేసీఆర్. కాని మునుగోడుకు మాత్రం ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా చేసిన 10 రోజుల్లోపే వస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. ఈనెల 20న మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు అమిత్ షా వస్తున్నారు. అమిత్ షా సభకు కౌంటర్ గానే ఒక రోజు కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని అంటున్నారు.
మునుగోడు టీఆర్ఎస్ లో ప్రస్తుతం అసమ్మతి తీవ్రంగా ఉంది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మితి నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసమ్మతి నేతలను మంత్రి జగదీశ్ రెడ్డి బుజ్జగించినా ఫలితం లేకుండా పోతోంది. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. టీఆర్ఎస్ అసమ్మతి నేతలకు బీజేపీ నేతలు గాలం వేస్తున్నారని తెలుస్తోంది. ఈనెల 20న జరిగే అమిత్ షా సభలో టీఆర్ఎస్ అసమ్మతి నేతలను బీజేపీలో చేర్చుకునేలా మాజీ మంత్రి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ చేరికల కమిటి చైర్మెన్ గా ఉన్న ఈటల రాజేందర్ భార్య జమునా రెడ్డి స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉంది. మునుగోడు నేతలతో ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలకు కమలం గాలం వేస్తుందని గ్రహించిన మంత్రి జగదీశ్ రెడ్డి.. సీఎం కేసీఆర్ తో మునుగోడులో బహిరంగ సభ పెట్టిస్తున్నారని అంటున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ కావడంతో అసమ్మతి నేతలు కుడా వస్తారని.. ఆ విధంగా వాళ్లకు చెక్ పెట్టవచ్చని మంత్రి జగదీశ్ రెడ్డి స్కెచ్ వేశారని అంటున్నారు.
సీఎం కేసీఆర్ మునుగోడు సభపై మరిన్ని ప్రచారాలు సాగుతున్నాయి. ఆగస్టు నెలాఖరులో మునుగోడు ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ వస్తే కోడ్ అమల్లోకి వస్తుంది. అందుకే కేసీఆర్ ముందే మునుగోడులో పర్యటిస్తున్నారని.. నియోజకవర్గానికి సంబంధించి పలు పథకాలు ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ నేతలు కూడా శనివారం మునుగోడులో పాదయాత్ర చేయనున్నారు. ఈనెల 16 నుంచి గ్రామాల వారీగా రచ్చబండ నిర్వహించబోతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇకపై పూర్తిగా మునుగోడుపైనే ఫోకస్ చేయబోతున్నారు. మొత్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ,సీఎం కేసీఆర్ బహిరంగ సభలు వరుస రోజుల్లో జరుతుండటం మునుగోడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
Read also: Munugode Byelection: సీఎం కేసీఆర్ కు మునుగోడు నేతల షాక్.. కూసుకుంట్లను ఓడిస్తామని తీర్మానం
Read also: Raksha Bandhan 2022: మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత.. చిన్ననాటి ఫోటో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook