Revanth Reddy: ఎక్కడైనా పార్టీలోకి వలసలు ఉంటే.. ఆ పార్టీ కేడర్ లో ఉత్సాహం కనిపిస్తుంది. వలస నేతలతో పార్టీ బలోపేతం అవుతుందనే ఆశ ఉంటుంది. కాని తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం మరోలా ఉంది. ఆ పార్టీలోకి కొన్ని రోజులుగా చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో వర్గ పోరు పెరిగిపోతోంది. ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. ఇప్పటికే వర్గ విభేదాలతో అల్లాడుతున్న కాంగ్రెస్ కు కొత్త నేతలతో మరింత తలనొప్పులు వస్తాయనే టాక్ కాంగ్రెస్ కేడర్ నుంచే వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు వల్లే సమస్యలు వస్తున్నాయని సీనియర్ నేతలు ఆరోపిస్తుండగా.. రేవంత్ రెడ్డిని బలహీనం చేసే కుట్రలోనే అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ వర్గీయులు కౌంటరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రేటర్ హైదరాహద్ పరిధిలోని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి ఆమెను కండావు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే విజయారెడ్డి చేరికపై ప్రస్తుతం ఖైరతాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ కు సమాచారం లేదట. తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి చెందిన నేతలు ఎలా చేర్చుకుంటారని శ్రవణ్ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. గ్రేటర్ కాంగ్రెస్ నేతలకు కూడా విజయారెడ్డి జాయినింగ్ విషయం తెలియదంటున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక నియోజకవర్గానికి చెందిన గులాబీ పార్టీ జడ్పీటీసీ కాంతారావు గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. అయితే తాటి చేరిక విషయం ఖమ్మం జిల్లాకు చెందిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు తెలియకపోవడం కాంగ్రెస్ పార్టీలో కాక రేపింది. భట్టికి సమాచారం లేకుండా ఖమ్మం జిల్లా నేతలను పార్టీలో చేర్చుకోవడంపై సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ తీరుపై అసహనంగా వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క.. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు.


జగిత్యాల జిల్లా మెట్ పల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ కూడా ఆదివారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే  ఈ విషయం స్థానిక నేత, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మాట మాత్రమైనా చెప్పలేదట. మీడియాలో ఈ వార్తను చూసిన జీవన్ రెడ్డి అవాక్కయ్యారని తెలుస్తోంది. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని నేతలను ఎలా చేర్చుకుంటారని జీవన్ రెడ్డి నిలదీశారని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ వర్గ పోరు రోడ్డెక్కింది. రేవంత్ రెడ్డి మద్దతుతో సుభాష్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన మదన్ మోహన్ రావు మరో వర్గంగా ఉన్నారు. మహన్ మోహన్ రావుకు భట్టీ అండదండలు ఉన్నాయంటున్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఇరు వర్గాల నేతలు గొడవకు దిగారు. ఏకంగా కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన కాంగ్రెస్ లో కలకలం రేపింది.


రేవంత్ రెడ్డి సొంతంగానే నేతలను చేర్చుకుంటుండటంతో తాను వెనకబడిపోయాయని అనుకున్నారో ఏమో... టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా జోరు పెంచారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో వడ్డెపల్లి రవి అనే నేతను పార్టీలో చేర్చుకున్నారు. వడ్డేపల్లి రవి గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేశారు. అద్దంకి దయాకర్ ఓటమికి కారకుడయ్యాడు. ఆ సమయంలోనే రవిని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయకుండానే వడ్డేపల్లి రవికి పార్టీ కండువా కప్పేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అద్దంకి దయాకర్ కు టికెట్ రాకుండా చూసేందుకే రవిని కోమటిరెడ్డి పార్టీలో చేర్చుకున్నారనే టాక్ వస్తోంది. ఈ విషయంపై ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు అద్దంకి దయాకర్. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. స్థానిక నేతలకు తెలియకుండానే ఇతర పార్టీల నేతలకు పార్టీలో చేర్చుకుంటారనే విమర్శలు గాంధీభవన్ కు వస్తున్నాయని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని సీనియర్ నేతలు అంటున్నారు. వలస నేతలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందంటున్నారు. 


Read also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..వాతావరణ శాఖ ఏం చెబుతోంది..!   


Read also: Bank Holidays July: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జూలైలో 17 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి