తెలంగాణ ఎన్నికలు: స్వతంత్ర అభ్యర్థిగా సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత
‘మాటల మడుగు’ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని గెలుపొందిన రచయిత్రి మెర్సీ మార్గరెట్.. తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
‘మాటల మడుగు’ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని గెలుపొందిన రచయిత్రి మెర్సీ మార్గరెట్.. తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ స్థానం నుండి ఆమె పోటీ చేస్తున్నారు. ముషీరాబాద్‌లో పుట్టిపెరిగిన ఆమె తమ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఫేస్ బుక్ సాహిత్య వేదిక కవి సంగమం ద్వారా విస్తృతంగా కవిత్వం రాసిన మెర్సీ మార్గరెట్.. 2015లో పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.
అంతకు ముందే.. తనలాంటి యువకవుల కోసం ‘కవిత్వశాల’ అనే బృందం ఏర్పాటుచేశారు. 2016లో "దక్షిణ భారత కవుల సదస్సు"లో కూడా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా (ప్రస్తుత సూర్యాపేట జిల్లా) వల్లభాపురం నుంచి దశాబ్దాల క్రితం రజాకార్ల ఉద్యమం సమయంలో మెర్సీ తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. చిన్నప్పటి నుండి సాహిత్యాన్ని విరివిగా చదివిన మార్గరెట్.. భారత్ మహిళా కళాశాలలో ప్రొఫెసరుగా కూడా విధులు నిర్వహించారు.
ఇక ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే.. 2014లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.లక్ష్మణ్ ఇక్కడి నుండే శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1999లో కూడా బీజేపీ ద్వారానే ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ నుండి కె.సీతయ్య గుప్తా ఒకసారి, టంగుటూరి అంజయ్య మూడు సార్లు, ఎం.కోదండ రెడ్డి రెండు సార్లు, టి.మణెమ్మ రెండు సార్లు గెలుపొందారు. అలాగే నాయిని నరసింహారెడ్డి కూడా జనతా పార్టీ తరఫున రెండు సార్లు, టీఆర్ఎస్ నుండి ఒకసారి గెలుపొందారు. అయితే ఇదే నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి కూడా గెలుపొందిన చరిత్ర ఉంది. 1983లో ఎస్.రాజేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. కానీ.. ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.