తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల్లో రైతు బంధు పథకం ఒకటి. రైతులు కొత్త పంటలు వేసే సందర్భంలో పెట్టుబడి కోసం దళారులు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయకుండా, నేరుగా వారి ఎకౌంట్‌లోనే ఎకరాకు 4వేల చొప్పున ఆర్థిక సహాయం జమ చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ రైతు బంధు పథకం తొలిసారిగా ఈ ఖరీఫ్ సీజన్‌లో అమలు కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఖరీఫ్ పంట కోసం అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన రైతు బంధు పథకం చెక్కులను మే 10 నుంచి పంపిణీ చేస్తామని అన్నారు. అదే రోజు నుంచి కొత్త పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. 58 లక్షల మంది రైతులకు చెక్కులు, పాస్‌ పుస్తకాల పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు 8,25,571 మందికి పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ జరగాలని సంబంధింత అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 


రైతులకు పాస్ పుస్తకాలు, రైతు బంధు పథకం చెక్కుల పంపిణీకి కార్యాచరణను రూపొందించడం కోసం ఈ నెల 21న హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్... త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.