తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవిన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శుక్రవారం తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో పరకాలను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. ఆమేరకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. పరకాల, ఆత్మకూర్, శాయంపేట, దామెర, నడికుడ మండలాలతో కలిపి కొత్త పరకాల డివిజన్ ఏర్పాటవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో మూడు దశాబ్దాల పరకాల ప్రాంత ప్రజల కల సాకారమైంది. 30 ఏళ్లుగా పరకాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చేవారే కరువయ్యారు. దీంతో పరకాల ప్రాంత ప్రజలు పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. స్వరాష్ట్రం ఏర్పాటు అయ్యాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ డివిజన్ ఇస్తానని హామీ ఇచ్చారు.


కాగా, కొత్తగా దామెర మండలంలో కలిపిన నాలుగు గ్రామాలు కౌకొండ, కంఠాత్మకూర్, సర్వాపూర్, రామకృష్ణాపూర్ గ్రామాలతోపాటు నడికూడకు ఆవలివైపున ఉన్న నార్లాపూర్, వరికోలు, రాయపర్తి, పులిగిల్ల, చర్లపల్లి, చౌటుపర్తి, ధర్మారం, ముస్త్యాలపల్లితో మొత్తం 13 గ్రామాలతో నడికూడ మండలం ఏర్పాటు కాబోతున్నది. ఈ రెండింటికిగానూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.