వీఆర్వో సహా పలు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
వీఆర్వో సహా పలు ఉద్యోగాల దరఖాస్తులకు గడువును పెంచింది టీఎస్పీఎస్సీ.
వీఆర్వో సహా పలు ఉద్యోగాల దరఖాస్తులకు గడువును పెంచింది టీఎస్పీఎస్సీ. దీంతో ఏఎస్‌ఓ, వీఆర్వో, సీసీఎల్‌ఏ, హోంశాఖలో సీనియర్ స్టెనో ఉద్యోగాలకు దరఖాస్తులకు గడువును పెరిగింది. జులై 2తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో దరఖాస్తుల తాకిడి పెరగడంతో టీఎస్పీఎస్సీ సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును పొడగించింది. దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కాగా జులై2 ఒక్కరోజే సెకనుకు 12 వేల దరఖాస్తులు వచ్చినట్లు సర్వీస్ ప్రొవైడర్లు తెలిపారు.
వీఆర్వో ఉద్యోగాలకు 9.25 లక్షల దరఖాస్తులు
వీఆర్వో ఉద్యోగాలకు 9.25 లక్షలు, ఏఎస్‌వో ఉద్యోగాలకు 7500, స్టెనో ఉద్యోగాలకు 500 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారి రుసుములను అభ్యర్థుల బ్యాంక్ ఖాతా ద్వారా తిరిగి చెల్లిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా టీఎస్‌పీఎస్సీ 2,786 పోస్టులతో ఐదు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్-4, వీఆర్వోతో పాటు సీనియర్ స్టెనో, ఆర్టీసీ, అర్థ గణాంక శాఖల నోటిఫికేషన్లు ఉన్నాయి. అత్యధికంగా గ్రూప్-4లో 1,521 పోస్టులు, రెవెన్యూలో 700 వీఆర్వో, అర్థ గణాంకశాఖలో 474 మండల ప్రణాళిక, గణాంక అధికారులు/ సహాయ గణాంక అధికారుల పోస్టులు ఉన్నాయి.