తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు బంధు పథకం విధివిధానాలను బుధవారం ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి చెక్కుల ద్వారా ఎకరానికి 2 పంటలకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడమే  రైతు బంధు పథకం వెనుకున్న ప్రధాన లక్ష్యం. రైతు బంధు పథకం గురించి మరింత సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనుంది. రైతు బంధు పథకం కోసం వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకింగ్, రాష్ట్ర సమాచార శాఖ అధికారుల అధ్యక్షతన రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 8 బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రైతులకు చెక్కులను పంపిణీ చేయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ. 50 వేల లోపు వారికి సింగిల్ చెక్కు ఇవ్వనుండగా.. అంతకన్నా ఎక్కువ మొత్తం వున్న వారికి రెండు చెక్కులు జారీ చేసే విధంగా విధివిధానాలు రూపొందించారు. పట్టాదారులకే నేరుగా చెక్కులు పంపిణీ చేయనుండగా అందుకు సంబంధించిన వివరాలను సంబంధిత విభాగం అధికారులు ఎప్పటికప్పుడు ప్రతీ రోజు వెబ్‌సైట్‌లో సంక్షిప్తం చేయనున్నారు. చెక్కుల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా చెక్కులపై పట్టాదారు పేరు, పట్టాదారు పాస్‌బుక్ నెంబర్, ఆధార్ నెంబర్, వారి వయస్సు, రెవెన్యూ విలేజ్, మండలం, జిల్లా, ఆర్థిక సహాయం మొత్తం, కమిషనర్, డైరెక్టర్ స్పెసిమన్ సంతకం, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఉండనున్నాయి. 


చెక్కులపై రైతు బంధు పథకం పేరును కూడా ముద్రించనుండటంతో చెక్కులు పక్కదారి పట్టే అవకాశం కూడా లేదు. చెక్కు చెల్లుబాటు కాలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. ఆలోగా చెక్కుని నగదుగా మార్చుకోలేకపోతే, ఆ తర్వాత మళ్లీ కొత్త చెక్కు తీసుకోవాల్సి ఉంటుంది. డీఏఓలు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు, సహకార శాఖ, ఆర్డీవోలు, ఏడీయేలు పర్యవేక్షణలో చెక్కుల పంపిణీ జరగనుంది.