తెలంగాణలో కొలువుల జాతర నడుస్తోంది. ఇప్పటికే  పలు నోటిఫికేషన్లు జారీ చేసిన తెలంగాణ సర్కార్ మరికొన్ని నోటిఫికేషన్ల జారీకి రంగం సిద్ధం చేసింది. తాజాగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురుకులాల్లో 5 వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టులు


తెలంగాణలోని గురుకులాల్లో గల 5 వేలకు పైగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి 10 రోజుల్లో ప్రకటన రానుంది. టీఎస్పీఎస్సీ సిలబస్‌తో గురుకుల విద్యాలయ నియామక బోర్టు పరీక్షలు నిర్వహించనుండగా.. పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి లభించింది. ఇది పూర్తవగానే జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది. 1979 తర్వాత తొలిసారి మార్కెట్లలో 200 పోస్టుల నియామకానికి బుధవారం టీఎస్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగంతి తెలిసిందే.


టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో..


టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో త్వరలో 3010 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఇందులో 2400 జూనియర్ లైన్ మెన్, 500 ఎల్‌డీసీ, 70 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. జేఎల్ఎం పోస్టుల్లో 90% స్థానికులకే కేటాయించడంపై హైకోర్టులో పిటీషన్ దాఖలవడంతో.. తీర్పు వచ్చిన తరువాత ప్రకటన విడుదల చేస్తామని ఎస్పీడీసీఎల్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 318 ఏఈ (ఎలక్ట్రికల్‌), 133 సబ్‌ ఇంజనీర్‌, 112 జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌, 19 ఏఈ (సివిల్‌) కలిపి 582 ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు.


ఈ నెల 30 వరకు గడువు


పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌తోపాటు ఆయా విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 18,428 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 30 అర్ధరాత్రితో  దరఖాస్తు గడువు ముగియనుంది. అభ్యర్థులు పోలీసు నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.inను సందర్శించవచ్చు. మొత్తం పోస్టులకు 8 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంపుపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా ఈ నెల 2న రెండు వేల 786 పోస్టుల భర్తీ కోసం ఐదు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా తాజా ప్రకటనతో నిరుద్యోగులకూ మరింత ఊరట నిచ్చినట్లయింది తెలంగాణ సర్కార్.