రెండు విధానాల్లో పంచాయితీ ఎన్నికలు
ఇకపై తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ఒకేలా ఉండబోదు.
ఇకపై తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ ఒకేలా ఉండబోదు. కొన్నింటికి ప్రత్యక్ష ఎన్నికలు, మరికొన్నింటికి పరోక్ష ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంచాయితీరాజ్ ఎన్నికల్లో రెండు విధానాలు అమలు చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర సర్కారు పరిశీలిస్తోంది.
ఐదు వేల జనాభా గల పంచాయితీలకు ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఐదు వేల జనాభా దాటిన పంచాయితీలకు పరోక్ష పద్దతిలో ఎన్నికలు జరపాలని అధికారులు యోచిస్తున్నారు. పరోక్ష విధానంలో గ్రామ పంచాయితీకి ఎన్నికైన వార్డు సభ్యుల్లో ఒకరిని సర్పంచ్‌గా ఎన్నుకుంటారు.
పంచాయతీరాజ్ చట్టం ముసాయిదా రూపకల్పన సమయంలో ప్రత్యక్ష, పరోక్ష ఎన్నిక విధానంపై ప్రభుత్వం వివిధ వర్గాలతో చర్చలు జరిపిందని, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పంచాయతీరాజ్ బిల్లులో ఈ ప్రస్తావన ఉన్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ సంస్థల్లో భాగమైన మండల, జిల్లా పరిషత్‌లకు కూడా 1995 నుంచి పరోక్ష విధానమే అమలులో ఉందనే సంగతి తెలిసిందే..!
కాగా.. సర్పంచ్‌ను ఏ పద్ధతిలో ఎన్నుకోవాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని అధికారులు చెబుతున్నారు. అయితే 90 శాతానికి పైగా పంచాయితీలకు ప్రత్యక్ష పద్దతిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.