రైతు బంధు పథకం నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కోసం నిధులు విడుదల అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కోసం నిధులు విడుదల అయ్యాయి. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు నిధులను విడుదల చేస్తూ తెలంగాణ వ్యవసాయ శాఖ నేడు ఉత్తర్వులు జారీచేసింది. రైతు బంధు సంక్షేమ పథకం నియమ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగు పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందచేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో నియమ నిబంధనలు రూపొందించిన ప్రభుత్వం త్వరలోనే రైతులకు రైతుబంధు పథకం చెక్కులు సైతం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే రైతు బంధు పేరిట చెక్కుల ముద్రణ కూడా ప్రారంభమైంది. రైతు బంధు పథకం చెక్కుల ద్వారా నగదు పొందేందుకు బ్యాంకులకు వచ్చే రైతులను గుర్తించడానికి రాష్ట్రప్రభుత్వం ఓ యాప్‌ను సిద్ధం చేస్తోంది.
ఏ బ్యాంకులోనైనా చెక్కును నగదుగా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆర్డర్ చెక్కులు జారీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. గ్రామసభలో చెక్కు అందుకున్న రైతు ఏదైనా బ్యాంకులో సొమ్ము తీసుకోవడానికి వెళ్లినప్పుడు సదరు బ్యాంకు అధికారులు, ఆ రైతు పాస్‌బుక్ ఖాతా నంబర్‌ను పరిశీలిస్తారు. పాస్‌బుక్ నంబర్‌ను ఈ యాప్‌లో ఎంటర్ చేయగానే రైతు వివరాలన్నీ వారికి అందుబాటులోకి వస్తాయి. ఆ వివరాలన్నీ పరిశీలించాకే వచ్చిన వ్యక్తి నిజమైన రైతు అని రుజువు చేసుకున్నాకే ఆ నగదుని రైతు చేతికి అందించేలా నిబంధనలు రూపొందించారు.