హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతితో పాటు అన్నీ రకాల పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి ఛానెల్ ద్వారా పునశ్చరణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు  విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 


దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తరుణంలో పదో తరగతి పరీక్షలు కరోనా వైరస్ కారణంగా మధ్యంతరంగా వాయిదా పడడంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రారంభం కాబోయే తరగతులను ఈ నెల 12 వ తేదీ నుండి 23 వరకు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్లము, గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టులపై ఈ తరగతులు ఉంటాయని తెలిపారు. విద్యార్థుల భవిషత్తు ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని తమ ఇంట్లో ఉండే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..