హైదరాబాద్: కరోనా వైరస్ నివారణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, మందులను వ్యాపార సంస్థలు బ్లాక్‌ మార్కెట్‌ చేయకుండా నియంత్రించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. కరోనావైరస్ నివారణకు, కరోనా పాజిటివ్ కేసుల చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్య పరికరాలను కేంద్రమే నేరుగా సేకరించి రాష్ట్రాలకు అందించడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించాలని మంత్రి ఈటెల కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నివారణ చర్యలపై రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ విజ్ఞప్తిచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : 24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు, 33 మంది మృతి


పన్నులు ఎత్తివేయాలి:
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా రాష్ట్రాలు ఆర్థికంగా ఎంతో నష్టపోయాయని చెబుతూ.. రాష్ట్రాలపై ఇంకా పన్ను భారం పడకుండా ఉండాలంటే దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై కేంద్రం పన్నులు ఎత్తివేయాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. కరోనా నివారణకు యుద్ధ ప్రాతిపదికన అవసరమైన వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఈసీఐఎల్‌, డీఆర్‌డివో లాంటి సంస్థల్లో తయారుచేయించి కేంద్రమే రాష్ట్రాలకు అందజేస్తే బాగుంటుందని మంత్రి ఈటల కేంద్రానికి సూచించారు.


Also read : ఏపీలో 133 రెడ్ జోన్లు.. కరోనాపై లేటెస్ట్ అప్‌డేట్స్


తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగలేదు:
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి గురించి, ప్రస్తుత పరిస్థితిపైన మంత్రి ఈటల కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు వివరించారు. ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ పద్ధతిలో వైరస్ వ్యాపించలేదని, మర్కజ్‌కి వెళ్లొచ్చిన వాళ్లు, వాళ్లతో కాంటాక్ట్ అయిన వారికే కరోనా ఎక్కువగా సోకిందని తెలిపారు. రాష్ట్రంలో 8500 మందికి కరోనా పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్‌ అని తేలిందని మంత్రి ఈటల గుర్తుచేశారు. శుక్రవారం వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం తెలంగాణలో 45 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవ్వగా.. దురదృష్టవశాత్తుగా మరో 12 మంది కరోనాతో మృతి చెందినట్టు వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..