కర్ణాటక శాసనసభకు శనివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి వివిధ మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకదానికొకటి భిన్నంగా వున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండగా ఇంకొన్ని ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వుండటం పరిశీలకులను కొంత అయోమయానికి గురిచేస్తోంది. ఇదే విషయమై తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్స్ విడుదల చేసిన కర్ణాటక ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను అర్థం చేసుకోవడం కంటే కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం మరొకటి వుండదు అని అభిప్రాయపడ్డారు. రెండు ఇంగ్లీష్ చానెల్స్ బీజేపీ గెలుస్తుందంటే.. మరో రెండు చానెల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ హంగ్‌లానూ కనిపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో సెటైర్ వేశారు.