హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో విజయం సాధించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకం గతేడాది డిసెంబర్ చివరి నుంచి వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా నియామక ఉత్తర్వులు జారీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో అభ్యర్థుల పోస్టింగుకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. తొలి విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు తెలంగాణలో పోలింగ్‌ పూర్తయిన అనంతరం నియామక పత్రాలు జారీచేయవచ్చని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్టు తెలుస్తోంది. అవినీతికి తావులేకుండా ఉండేందుకు అభ్యర్థులకు వారి వారి సొంత పంచాయతీల్లో పోస్టింగ్‌లు ఇవ్వరాదని ప్రభుత్వం ఈ ఆదేశాల్లో స్పష్టంచేసినట్టు సమాచారం. 


తెలంగాణలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 30న నోటిఫికేషన్ వెలువడగా అక్టోబర్ 10వ తేదీన రాతపరీక్ష నిర్వహించారు. డిసెంబర్ 18న జిల్లాల వారీగా ఫలితాలను వెల్లడించగా డిసెంబర్ 25వ తేదీకే నియామకపత్రాలు అందుతాయని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే, అభ్యర్థుల ఎంపిక విధానం నిబంధనలకు విరుద్ధంగా ఉందని పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఈ పోస్టుల నియామకం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే.