తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు లిఫ్ట్ ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన మరో శాసనసభ్యుడు దివాకరరావుతో కలిసి ఆసుపత్రి లిఫ్ట్‌లో మూడో అంతస్తుకి వెళ్లారు. అయితే పలు సాంకేతిక కారణాలతో లిఫ్ట్ మొదటి అంతస్తులోనే ఆగిపోయింది. ఆ తర్వాత పెద్ద శబ్దంతో తెగిపోయి కిందపడిపోయింది. అయితే ఊహించని ఈ హఠాత్పరిమాణానికి అందరూ హతాశులయ్యారు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లో చిక్కుకుపోయిన మంత్రితో పాటు మిగతావారిని కుర్చీల సహాయంతో సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి.. ఆ లిఫ్ట్‌ పరిమితి ప్రకారం పది మంది మాత్రమే ఎక్కడానికి చోటుండగా.. 16 మందిని బలవంతంగా లోపలికి పంపించడంతో బరువు ఎక్కువై వైర్లు తెగాయని టెక్నీషియన్లు అంటున్నారు. అయితే మంత్రితో సహా మిగతా వారందరూ కూడా క్షేమంగా బయటపడడంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆ సంఘటన జరిగాక.. కొంత సేపు రిలాక్స్ అయ్యి మంత్రి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వెళ్లిపోయారు. 


జోగు రామన్న ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత తెలుగుదేశం పార్టీలో ఆయన క్రియాశీలకంగా పనిచేసినా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మన దేశంలో మంత్రులకు లిఫ్ట్ ప్రమాదాలు జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా లిఫ్ట్ ప్రమాదం బారిన పడ్డారు.  పెద్దాపురం మండలం కట్టమూరు వద్ద రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఆయన లిఫ్ట్ ఎక్కగానే వైరు తెగిపోవడంతో ఆయన నడుము భాగంలో గాయాలయ్యాయి.