Munugodu Bypoll: తారాస్థాయికి చేరిన పంపకాలు, అర్ధరాత్రి రహస్యంగా చేతులు మారుతున్న నోట్ల కట్టలు
Munugodu Bypoll: తెలంగాణ మునుగోడు పోలింగ్‌కు మరికొద్ది గంటలు మిగిలింది. గంటల వ్యవధి మిగలడంతో పంపకాల కార్యక్రమం తారాస్థాయికి చేరుకుంది. ఏ మాత్రం సందడి లేకుండా..నోట్లు చేతులు మారుతున్నాయి.
మునుగోడులో డబ్బులు నీళ్లలా ప్రవహిస్తున్నాయంటే అతిశయోక్తి కానేకాదు. ఒక పార్టీకే పరిమితమైన వ్యవహారం అంతకంటే కాదు. ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య సాగుతున్న నోట్ల పంపిణీ పోటీ.
మునుగోడులో ఇక మిగిలింది పోలింగ్ ఒక్కటే. పంపిణీ పర్వం కూడా దాదాపు చివరి అంకానికి చేరింది. నిన్నటివరకూ నువ్వా నేనా అంటూ ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకున్న పార్టీలు ఇప్పుడు మూగబోయాయి. మైకులు, వాహనాలతో హోరెత్తిస్తూ సందడి చేసిన నేతలు, కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పోలింగ్ కు కేవలం కొద్దిగంటలు మిగిలుండటంతో..పంపిణీ పర్వం చివరి అంకానికి చేరుకుంది. ఇప్పుడిక ఎంత నిశ్శబ్దంగా వ్యవహారం జరిపితే అంత మంచిది. నోట్ల కట్లలు భారీగా చేతులు మారుతున్నాయి. పోటాపోటీగా డబ్బులు పంచుతుండటంతో..ఓటర్లకు పండగలా మారింది.
మునుగోడులో ఉపఎన్నికల పుణ్యమా అని తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంతగా తయారైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ 2-3 వేల వరకూ పంచుతోంది. గెలిచి తీరాలనే పట్టుదలతో ఒకరు, పరువు కోసం మరొకరు, ప్రతిష్ట కోసం ఇంకొకరు ఇలా కారణం ఏదైనా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కీలకమైన ఎన్నిక ఇది.
ఇప్పటికే మునుగోడులో ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ కార్యక్రమాల నిమిత్తం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు 200 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పోలింగ్ ముందు ఈ రెండ్రోజులు నోట్ల పంపకంపై దృష్టి సారించాయి. రెండు పార్టీలు కలిపి మరో వంద కోట్ల వరకూ ఖర్చుపెట్టే పరిస్థితి లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. పార్టీల ప్రచారమంతా నోట్ల కట్టల చుట్టూనే తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓటుకు 1000 రూపాయల వరకూ ఖర్చుపెడుతోంది. అటు బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు ఓటుకు 3 వేల వరకూ ఇస్తున్నారంటే..పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు 5 వేలు కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook