తెలంగాణ: కానిస్టేబుల్ పోస్టులకు రేపే రాత పరీక్ష..
తెలంగాణలో 16,925 కానిస్టేబుల్, ఫైర్‌మెన్ పోస్టులకు ఆదివారం (30.09.2018) రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు.
కానిస్టేబుల్ పోలీస్ సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్, టీఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీఎఫ్‌తో పాటు ఫైర్‌మెన్ పోస్టులకు రాత పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఆదివారం రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి రావాలని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందని.. అభ్యర్థులను గంట ముందు నుంచే హాల్లోకి అనుమతించడం జరుగుతుందని వివరించారు. అభ్యర్థులు తమ వెంట పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. బ్లూ, బ్లాక్ బాల్‌పెన్.. అదనంగా మరో పెన్ను తీసుకెళ్లడం మినహా ఎలాంటి వస్తువులను వెంట తీసుకురాకూడదని స్పష్టం చేశారు.
బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకుంటారని తెలిపారు. పరీక్ష హాల్‌లో అభ్యర్థి ఫొటోలను తీస్తారని.. దీంతో ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడానికి ప్రయత్నిస్తే సులువుగా దొరికిపోతారని.. అట్టి వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. చేతులకు గోరింటాకు ఉండకూడదు.. ఆభరణాలు ధరించకూడదు. అలాగే చేతి గడియారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులను పరీక్షా హాల్లోకి తీసుకురాకూడదు.
మొత్తం 16,925 కానిస్టేబుల్ పోస్టులకుగాను రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే పోలీసు నియామక బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఖాళీల వివరాలు..
- కానిస్టేబుల్ (పురుష, మహిళా)-పోలీస్ సివిల్- 5,909 పోస్టులు
- కానిస్టేబుల్ (పురుష, మహిళా)-ఆర్మ్‌డ్ రిజర్వ్- 5,273 పోస్టులు
- కానిస్టేబుల్ (పురుష)-ఎస్‌ఏఆర్ సీపీఎల్-53 పోస్టులు
- కానిస్టేబుల్ (పురుష)- టీఎస్‌ఎస్‌పీ -4,816 పోస్టులు
- కానిస్టేబుల్ (పురుష)- ఎస్‌పీఎఫ్- 485పోస్టులు
- ఫైర్‌మన్-అగ్నిమాపక శాఖ-168 పోస్టులు
- వార్డర్స్ (పురుష)-జైళ్ల శాఖ-186 పోస్టులు
- వార్డర్స్ (మహిళ)-జైళ్ల శాఖ- 35 పోస్టులు