తెలంగాణ పోలీస్‌ శాఖ పరిధిలోని ఎస్సై, ఏఎస్సై కానిస్టేబుల్స్ విభాగాల్లో 18,428 ఖాళీల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగుతోంది. ఈ ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆగస్టులో ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించేందుకు పోలీస్ నియామక బోర్డు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు సంబంధిత విభాగం అధికారులు ఏర్పాట్లు సైతం చేపట్టారు. గత శనివారం నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 30వ తేదీతో ముగియనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన మొదటి రోజున సుమారు 3,000 దరఖాస్తులు అందాయి. రెండో రోజైన ఆదివారం దరఖాస్తుల సంఖ్యలో కొంత మేరకు తగ్గుదల కనిపించినప్పటికీ.. మూడోరోజైన సోమవారం దరఖాస్తుల సంఖ్యలో వేగం పెరిగింది. ఈ నియామకాల మొత్తం ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేసే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 


పోలీస్ ఉద్యోగాల నియామకం ప్రక్రియ గురించి పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ "ఆన్‌లైన్‌‌లో దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా నియామకబోర్డు అధికారిక వెబ్‌సైట్‌, వెబ్‌సైట్‌లో సూచించిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు" అని అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే వారిని ఆశ్రయించి వారిచేతుల్లో మోసపోవద్దని ఈ సందర్భంగా శ్రీనివాస రావు ఉద్యోగార్ధులకు సూచించారు. దరఖాస్తు ప్రక్రియ ముగిశాక దరఖాస్తుల్లోని వివరాలు కానీ లేదా తప్పిదాలు కానీ సరిచేసుకోవాలని భావించే అభ్యర్థులకు ఆ తర్వాత మరోసారి అవకాశం కల్పిస్తామని నియామక బోర్డు అధికారులు తెలిపారు.