తెలంగాణ రాష్ట్రంలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహల్‌ గాంధీ పర్యటించనున్నారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఒకేరోజు మూడు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుల్‌ శనివారం ఉదయం ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ మార్గం ద్వారా ఆదిలాబాద్ జిల్లా భైంసా చేరుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కామారెడ్డికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత హైదరాబాద్ చేరుకొని రాజీవ్‌ సద్భావనా దినోత్సవంలో పాల్గొంటారు. ఏటా ఇచ్చే రాజీవ్‌ సద్భావనా అవార్డు ఈసారి మాజీ సీఎం రోశయ్యకు అందజేయనున్నారు. రాత్రి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. రాహుల్ పర్యటనను విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు.


 టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను రాహుల్‌ ప్రసంగాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నెరవేర్చని హామీలను, ప్రధానంగా ముస్లిం మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల అంశం, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం, దళితులు, గిరిజనులకు భూ పంపిణీలో వైఫల్యాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.


రాహుల్‌తో పదికిపైగా సభల నిర్వహణకు కాంగ్రెస్ నేతలు ప్రణాళిక రూపొందిస్తున్నారు. తెలంగాణలో ఈసారి అన్ని వర్గాల ఓట్లతో పాటు మైనార్టీల ఓట్లపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది.


యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రానున్నారని సమాచారం. ఈనెలాఖరులోపే సోనియా సభలనూ నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.


అటు మహాకూటమి సీట్ల సర్దుబాటు పూర్తి కాకపోవడంతో రాహుల్‌ పర్యటనకు కూటమి నేతలు దూరంగానే ఉంటున్నారు.


రాహుల్‌ పర్యటన సందర్భంగా ఇతర పార్టీల నుంచి చేరికలు ఉండొచ్చని చర్చ నడుస్తోంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్సీ రాములు నాయక్‌ రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. మరికొందరు ప్రముఖులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చనే ప్రచారమూ జరుగుతోంది. అటు తెలంగాణలో రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు గద్దర్‌ పిలుపునిచ్చారు.