హైదరాబాద్: తెలంగాణ సివిల్ పోలీసు, ఆర్మ్‌డ్ రిజర్వ్‌ (ఏఆర్) విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి శిక్షణ లభించనుంది. డ్రైవర్, మెకానిక్ విభాగాలకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు సైతం అదే రోజు నుంచి తెలంగాణ పోలీసు శాఖ శిక్షణ అందించనుంది. 9 నెలల పాటు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో 16,000 మందికిపైగా అభ్యర్థులు ఈ శిక్షణ పొందనున్నారు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణ కోసం జనవరి 16న సంబంధిత శిక్షణ కేంద్రాల వద్ద హాజరవ్వాల్సిందిగా తెలంగాణ పోలీసు శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 


తెలంగాణలోని 11 జిల్లాల్లో విధుల నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర లెవెల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) 17156 కానిస్టేబుల్ ర్యాంక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా.. సెప్టెంబర్ 25న ఫలితాలు వెలువడ్డాయి. టిఎస్ఎల్‌పిఆర్‌బి నిర్వహించిన పరీక్షల్లో అంతిమంగా 16,025 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అందులో 13,373 మంది పురుష అభ్యర్థులు ఉండగా 2652 మంది మహిళా అభ్యర్థులున్నారు.