తెలంగాణలో మరో కొలువుల ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలశాఖలో 105 పోస్టుల భర్తీకి పచ్చ జండా ఊపింది
తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలశాఖలో 105 పోస్టుల భర్తీకి పచ్చ జండా ఊపింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపట్టనున్న ఈ నియామకాల్లో 96 జూనియర్ అసిస్టెంట్, 9 జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే, ఇదే నీటిపారుదల శాఖ, ఆర్అండ్ బీ శాఖల్లో ఖాళీల భర్తీలో భాగంగా గతేడాది జరిగిన సివిల్ ఏఈఈ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. నీటిపారుదల శాఖ, ఆర్అండ్ బీ శాఖల్లో 310 సివిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకోసం 2017లో ఆగస్టు 27,28 తేదీల్లో నిర్వహించిన ఎంపిక పరీక్షకు 23,619 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో ఇంటర్వ్యూలు పూర్తి చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్... తాజాగా 293 మందిని ఎంపిక చేసినట్టు ప్రకటించింది.
దివ్యాంగుల కేటగిరిలో కేటాయించిన 17 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో ఆ ఖాళీలను భర్తీ చేయకుండా అలాగే వదిలేసినట్టు కమిషన్ తాజా ప్రకటనలో పేర్కొంది.