తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్  నేత మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవలే వెంకయ్యనాయుడు స్పందిస్తూ మోత్కుపల్లి త్వరలోనే తీపికబురు వింటారని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు గవర్నర్ గిరి ఖాయమనే విషయం స్పష్టమైంది. అయితే ఏ రాష్ట్రానికి కేటాయిస్తారు...ఎప్పుడు కేటాయిస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు నడుబిగించిన కేంద్రం ..అదే సమయంలో వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించాలని యోచిస్తోంది. తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో గవర్నర్లు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లో పూర్తి స్థాయి గవర్నర్లను నియమించాల్సి ఉంది. వీటితో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించాలని భావిస్తోంది. దీనిపై కేంద్ర కసరత్తు చేస్తోంది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్  బెర్త్ లు ఆనందీ బెన్, శంకరామూర్తిలకు దక్కనున్నాయి. తమిళనాడులో తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావు గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం మహారాష్ట్రకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. అక్కడ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆయన్న తమిళనాడుకే పరిమిత చేసే అవకాశముంది. అదే జరిగితే మహారాష్ట్ర గవర్నర్ బెర్త్ ఖాళీ అవుతుంది. దీంతో పాటు ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న కొందరిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్ గా పంపాలని కేంద్రం భావిస్తోంది. కల్ రాజ్ మిశ్రా, విజయ్ కుమార్ మల్హోత్రా, కైలాస్ జోషి, జితిన్ రామ్ మంఝీల గవర్నర్ గిరి రేసులో ఉన్నారు. మహారాష్ట్ర లేదా తమిళనాడు గవర్నర్ బెర్త్ కోసం మోత్కుపల్లి తమ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమచారం.. కేంద్రం మాత్రం అరుణ్ చల్ ప్రదేశ్ గవర్నర్ బెర్త్ ఇవ్వాలని భావిస్తోంది. అయితే అంతిమంగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.