Telangana:నేడు బీజేపీ గూటికి తెలంగాణ ఉద్యమ నేత విఠల్-రేపు తీన్మార్ మల్లన్న?
Telangana Vittal to join BJP: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమ నేత చింతలగట్టు విఠల్ నేడు బీజేపీలో చేరనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కూడా రేపు బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Telangana Vittal to join BJP: తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్పీఎస్సీ (TSPSC) మాజీ సభ్యుడు చింతలగట్టు విఠల్ నేడు (డిసెంబర్ 6) బీజేపీలో చేరనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన బీజేపీ (BJP) జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ప్రముఖ జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన మంగళవారం (డిసెంబర్ 7) బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా విఠల్ (Ch Vittal) కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన్ను తెలంగాణ విఠల్ (Chintalgattu Vittal) అని కూడా పిలుస్తారు. తెలంగాణ సాధన, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆయన టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది డిసెంబర్‌లో విఠల్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. నిజానికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి విఠల్‌కు దక్కవచ్చుననే ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ పదవిని ఐఏఎస్ అధికారి బి.జనార్ధన్ రెడ్డికి కట్టబెట్టింది. అప్పటినుంచి విఠల్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
పదవి దక్కకపోవడానికి తోడు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నియామకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం విఠల్‌లో అసంతృప్తిని మరింత పెంచింది. నియామకాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఆత్మగౌరవం లేని చోట ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు విఠల్ ఇటీవలే ప్రకటించారు. అంతేకాదు, ఆత్మగౌరవాన్ని చంపుకొని టీఆర్ఎస్‌లో (TRS) కొనసాగవద్దని తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని ఖాళీలు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నాయని విఠల్ చెబుతున్నారు. దాదాపు 40 శాతం (2లక్షల ఉద్యోగాలు) ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయకుండా తాత్సారం చేస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నిరుద్యోగుల ఆత్మహత్యలపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇక తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు ఆయన టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరనున్న విఠల్, తీన్మార్ మల్లన్న ఇద్దరూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ... టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఉద్యమ నేతలు, కేసీఆర్ వ్యతిరేకులను పార్టీలోకి ఆకర్షిస్తోంది. యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ కూడా బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: Akhanda movie: అఖండ మూవీ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌తో NBK fan మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook