దాదాపు మూడు దశాబ్దాలపాటు కొనసాగిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid Demolition Case)లో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ సహా 32 మందిని ల‌క్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించడం తెలిసిందే. ఈ తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో స్పందించారు. భారత న్యాయ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదును కూల్చివేతకు కారకులైన వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించడం (Babri Masjid Demolition Verdict) సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.



బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో తీర్పు వెలువడిన అనంతరం ఏఎన్‌ఐ మీడియాతో ఎంపీ అసదుద్దీన్ మాట్లాడారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో లబ్ధి పొంది బీజేపీ అధికారంలోకి వచ్చాక హోంమంత్రిగా, మానవ వనరులశాఖ మంత్రిగా పదవులు చేపట్టారని.. అలాంటి వారిని దోషులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఉద్దేశప్రకారం జరగలేదని, ప్లాన్ చేసి కూల్చారనేందుకు ఆధారాలు లేవని చెప్పేందుకు ఇన్ని సంవత్సరాలు సమయం పట్టిందా అని ప్రశ్నించారు. ఎవరూ కూల్చివేయకపోతే, బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా దీనికి సమాధానం ఏమిటని ప్రశ్నించారు.



 



 


ఇప్పటికీ కేసుకు సంబంధించిన కొందరు వ్యక్తులు రాజకీయంగా సహకారం, లబ్ధి పొందుతున్నారని.. బాబ్రీ కూల్చివేత కేసులో ఏ న్యాయం జరగలేదన్నారు. ఒకరు మసీదును ఎవరూ కూల్చివేయకపోతే ఎలా కూలిపోయిందో తనకు ఎవరైనా చెప్పాలని సైతం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత న్యాయ చరిత్రలో ఈరోజు నిజంగానే దుర్దినమని, దోషులకు శిక్షపడలేదని.. నిర్దోషులుగా తీర్పు వచ్చిందన్నారు.