హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించడానికి మార్చి 31వ తేదీతో గడువు ముగియనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ స్పష్టంచేశారు. నేడే ఆఖరి తేదీ కావడం, అందునా ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో నగర పౌరులు ఆస్తి చెల్లించడానికి మునిసిపల్ కార్యాలయాలకు తరలి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆదివారం జీహెచ్‌ఎంసీలోని అన్ని సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్స్ యథావిధిగా పనిచేస్తాయని కమిషనర్‌ దానకిషోర్‌ తెలిపారు. నగర పౌరుల సౌకర్యార్థం ఆదివారం రాత్రి 12 గంటల వరకు పౌర సేవా కేంద్రాలు పనిచేస్తాయని.. పౌర సేవా కేంద్రాలతో పాటు మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్‌ ద్వారా తమ ఆస్తిపన్ను చెల్లించవచ్చని కమిషనర్ సూచించారు. 


నిర్ణీత గడువులోగా ఆస్తి పన్ను చెల్లించని వారిపై జనవరి 1 నుంచి వున్న ఆస్తిపన్ను బకాయిలపై 2% జరిమానా విధిస్తామని కమిషనర్‌ దానకిషోర్ తేల్చిచెప్పారు. పౌర సేవా కేంద్రాలతో పాటు మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్‌ ద్వారా తమ ఆస్తిపన్ను చెల్లించవచ్చని కమిషనర్ సూచించారు. ఇప్పటి వరకు ఆస్తిపన్ను చెల్లించని 4,11,578 మంది పౌరులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వారి మొబైల్ నెంబర్లకు సందేశాలు పంపించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.1,500 కోట్లు కాగా శనివారం సాయంత్రం వరకు రూ.1,240.35 కోట్లు వసూలయ్యాయని కమిషనర్ దానకిషోర్ వివరించారు.