తెలంగాణ ఎన్నికలు: గోషామహల్లో బీజేపీ నేత రాజాసింగ్‌ను.. ఎదుర్కోనున్న ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గోషామహల్ ప్రాంతం నుండి బీజేపీ అభ్యర్థిగా రాజా సింగ్ బరిలోకి దిగుతున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే కాంగ్రెస్ నుండి ముఖేష్ గౌడ్ కూడా బరిలోకి దిగుతున్నారు. అయితే చిత్రమేంటంటే.. ఇదే నియోజకవర్గం నుండి బీఎల్ఎఫ్ తరఫున ఓ ట్రాన్స్‌జెండర్‌కి టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది ఫ్రంట్. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సామాజిక మార్పులో భాగంగా.. హిజ్రాల వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం తమ ఘనతని తెలిపారు.
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున కేటాయించిన టికెట్లలో భాగంగా గోషామహల్ నుండి తాము పోటీ చేయాల్సి ఉందని.. అందుకే తమ అభ్యర్థిగా చంద్రముఖిని ఎన్నుకున్నామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ సందర్భంగా అభ్యర్థిని చంద్రముఖి మాట్లాడుతూ... నేడు ట్రాన్స్‌జెండర్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని, వారిపై దాడులు కూడా జరుగుతున్నాయని.. అందరితో సమానంగా వారికి గౌరవం దక్కాలంటే వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిందేనని.. చట్టసభల్లో తమ సమస్యలను గురించి మాట్లాడాల్సిందేనని చంద్రముఖి అన్నారు.
చంద్రముఖి గతంలో పలు టీవీ షోలు చేయడంతో పాటు.. వ్యాఖ్యాతగా, యాంకర్‌గా కూడా పనిచేశారు. హైదరాబాదు పాత నగరంలోని భాగమైన గోషా మహల్ నుండి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్, బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై విజయాన్ని సాధించారు. 2014లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి టి.రాజా సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్‌ని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. పాతబస్తీతో హిందువుల డామినేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతంగా గోషా మహల్‌ని చెప్పుకోవచ్చు.