హైదరాబాద్: తెలంగాణ శాసన సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు రేపే చివరి రోజు కావడంతో నేడు టీఆర్‌ఎస్ పార్టీ మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తోన్న కోదాడ, ముషిరాబాద్ నియోజకవర్గాలకు నేడు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. కోదాడ నియోజకవర్గం నుంచి బొల్లం మల్లయ్య యాదవ్‌కు అవకాశం కల్పించిన కేసీఆర్.. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్‌కు టికెట్లను కేటాయించారు. దీంతో తెలంగాణలోని అన్ని 119 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా పూర్తయింది. 


2004 ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి గెలిచిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగానే ఈసారి ఆ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్ బీ-ఫారం అందుకోనుండగా మరోవైపు కోదాడలో మంత్రి జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో బొల్లం మల్లయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2014 ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి తెలంగాణలో బీజేపీకి అధ్యక్షుడైన కే లక్ష్మణ్ గెలుపొందగా కోదాడ నుంచి టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ చిట్టచివరిగా అభ్యర్థులను ప్రకటించిన రెండు స్థానాలు కూడా ఇవే కావడం గమనార్హం.