కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌ కుమార్‌ల సభ్యత్వ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్‌కు మరోసారి ఊరట లభించింది. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై హైకోర్టు సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ఉన్నందున వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని కాంగ్రెస్‌ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది.


కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ శాసన సభ స్పీకర్‌ మధుసూధనా చారి జారీ చేసిన ఆదేశాలను సింగిల్‌ బెంచ్ కొట్టివేసింది. వీరిద్దరినీ ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని గతంలో సింగిల్‌ బెంచ్ తీర్పు నిచ్చింది. కాగా దీనిపై 12 మంది టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించి అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అప్పీల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంపత్‌ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించగా..  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.