హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కే యాదవ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై టీఆర్ఎస్ పార్టీ యాదవ రెడ్డిని సస్పెండ్ చేసింది. ఈమేరకు టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన చేవేళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి చెందిన మనిషిగా కే యాదవ రెడ్డిపై ముద్రపడినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 


అయితే, ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విశ్వేశ్వర రెడ్డి ఇవాళ సాయంత్రం మేడ్చల్‌లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. విశ్వేశ్వర రెడ్డితోపాటు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కూడా నేడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్న నేపధ్యంలోనే టీఆర్ఎస్ అధిష్టానం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా క్రమశిక్షణ చర్యల కింద యాదవరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిందనే ప్రచారం జరుగుతోంది. అందరూ భావిస్తున్నట్టుగా యాదవ రెడ్డి కూడా విశ్వేశ్వర రెడ్డితోపాటే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా లేదా అనే ప్రశ్నకు ఈరోజే సమాధానం లభించనుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.