తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్‌లో మేనిఫెస్టో కమిటీ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల కోసం పాక్షిక మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టోలో కేసీఆర్ అన్ని వర్గాల వారికి వరాల జల్లు కురిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 65 సంవత్సరాల తర్వాత ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ల వయోపరిమితి అర్హతను.. తిరిగి అధికారంలోకి వస్తే 57 సంవత్సరాలకు కుదిస్తామని చెప్పారు. అటు ఈ మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి 2,016 రూపాయలకు పెంచుతామన్నారు. అలాగే వికలాంగులకు 3,016 రూపాయలు, నిరుద్యోగులకు కూడా 3,016 రూపాయలు భృతి ఇవ్వాలని ఇవ్వనున్నట్లు తెలిపారు.


రైతు బంధు కింద ఎకరానికి ఏడాదికి రూ. పది వేలు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. గతంలోలాగే రూ. లక్ష రైతు రుణమాఫీ చేస్తామని, రుణమాఫీతో నాలుగున్నర లక్షల మందికి లబ్ది చేకూరనుందన్నారు. రైతు సమన్వయ సమితులకు గౌరవభృతి ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం యథావిథిగా కొనసాగిస్తామన్నారు. రెడ్డి, ఆర్య, వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు, అగ్ర వర్ణాలకు ప్రత్యేక పథకాల రూపకల్పన చేస్తామన్నారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామన్నారు. రైతులకు స్వయం శక్తి చేకూరే వరకు అండగా ఉంటామని కేసీఆర్ భరోసానిచ్చారు.


అన్ని రాష్ట్రాలూ వేరు, తెలంగాణ వేరని చెప్పిన ఆయన.. ఈ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని.. చేరాల్సిన గమ్యాలు ఇంకా ఉన్నాయన్నారు. గత నాలుగేళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టోను రూపొందిచామని కేసీఆర్ చెప్పారు.