అవిశ్వాసంపై చర్చకు టీఆర్ఎస్ అడ్డొస్తుందంటే ఎలా ? : వినోద్ కుమార్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో కేంద్రానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుని బీజేపీకి మేలు చేసిందని వినిపిస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో కేంద్రానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుని బీజేపీకి మేలు చేసిందని వినిపిస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ పార్లమెంట్‌లో మొదటి నుంచే పోరాడుతోందని ఎంపీ వినోద్ కుమార్ స్పష్టంచేశారు. అవిశ్వాస తీర్మానం అనేది నిన్నకాక మొన్న వచ్చిన అంశం కానీ అంతకన్నా ముందు నుంచే తాము పార్లమెంట్‌లో తమ డిమాండ్ వినిపిస్తున్నామని వినోద్ కుమార్ అన్నారు. ముందుగా తమ రాష్ట్ర సమస్య పరిష్కరించాక ఏదైనా చర్చ చేపట్టాలని ఆయన తెగేసి చెప్పారు. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ వినోద్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
" అవిశ్వాస ఫలితాన్ని తేల్చేందుకు, ఎంపీల సంఖ్యను లెక్కించేందుకు తాము చేసే ఆందోళన అడ్డు కాబోదు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే.. అంతకన్నా ముందుగా తెలంగాణకు రావాల్సిన అంశాలను తాము లేవనెత్తుతాం. అంత మాత్రానికే అవిశ్వాసంపై చర్చకు టీఆర్ఎస్ అడ్డు అనడం సరికాదు " అని ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.