తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాలలో హిందీ పండిట్ పరీక్షలు రాసి 1.3 నిష్పత్తి ప్రకారం ఎంపికైన అభ్యర్థుల విషయంలో 2012 నాటి పాత జీవో ప్రకారమే నియామకాలు చేపట్టాలని హిందీ సేవా సదన్ మహా విద్యాలయ వ్యవస్థాపకులు గైబువల్లి, టీఆర్టీ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎ. కళ్యాణ్‌లు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గైబువలి, కళ్యాణ్‌లు మాట్లాడుతూ 2012 లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.4ను పరిగణలోకి తీసుకోకుండా నియామకాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అభ్యర్థులకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇప్పటికిప్పుడు జీవో నెం.25ను తీసుకొచ్చి, ఆ కొత్త జీవో ప్రకారమే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం ఎంతవరకు సరైన చర్య అవుతుందని బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా లేదనే సాకుతో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడంతో ఇప్పటికే ఎంపికైన వెయ్యి మంది అభ్యర్థులు నిరుద్యోగులుగా మారిపోతారని, వారి భవిష్యత్‌ అంధకారంలో మగ్గిపోయే ప్రమాదం ఉందని విచారం వ్యక్తం చేశారు.