గ్రూప్-4, జీహెచ్‌ఎంసీ బిల్‌కలెక్టర్, బేవరేజెస్ కార్పొరేషన్‌లో పోస్టులు, టీఎస్‌ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ప్రాథమిక ‘కీ’ని విడుదలైంది. వెబ్‌సైట్లో ‘కీ’ని అందుబాటులో ఉంచినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలిపింది. ఈ నెల17నే 'కీ' వెబ్‌సైట్‌లో ఉంచినా.. సాంకేతిక కారణాలతో అందుబాటులోకి రాలేదు. ఆదివారం నుంచి అందుబాటులోకి వస్తుందని, ‘కీ’పై అభ్యంతరాలను ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్దేశిత లింక్‌ ద్వారా పంపాలని సెక్రటరీ ఎ.వాణీ ప్రసాద్‌ శనివారం తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో భాగంగా బయోలాజికల్ సైన్స్ అభ్యర్థులకు 24న రెండో విడుత సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 62 మంది అభ్యర్థులను రెండో విడుత పరిశీలనకు ఎంపిక చేశామని, టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో  ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు కమిషన్ తెలిపింది. పూర్తివివరాలకు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.


మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో 124 బిల్‌ కలెక్టర్‌ పోస్టులు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి అక్టోబరు 7న రాతపరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు  రాష్ట్రవ్యాప్తంగా 65% అభ్యర్థులు హాజరయ్యారు.  వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 1,046 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.


డిసెంబర్ 15 నుంచి జేఎల్, డీఎల్ పరీక్షలు!


తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో భర్తీచేయనున్న 281 జూనియర్ లెక్చరర్లు, 466 డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి డిసెంబర్ 15 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్‌ఈఐఆర్బీ ఛైర్మన్ తెలిపారు. పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.