నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-4 హాల్‌టికెట్లు
నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-4 హాల్‌టికెట్లు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులతో పాటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లోని జూనియర్ అసిస్టెంట్, జీహెచ్‌ఎంసీలో బిల్ కలెక్టర్లు, తెలంగాణ బేవరేజెస్ సంస్థలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారికి.. నేటి నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెల్లడించింది. అభ్యర్థులు హాల్‌టికెట్లను www.tspsc.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ఈ పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం గత జూన్‌లో 2,786 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. వాటిలో 1,521 గ్రూప్-4 ఉద్యోగాలతోపాటు వీఆర్వో, ఏఎస్‌వో, ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే.. గ్రూప్-4 పోస్టులకు సంబంధించి అదనంగా మరో 74 పోస్టులను జతచేస్తూ.. గతవారంలో టీఎస్‌పీఎస్సీ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,595కి చేరింది. కొత్తగా కలిపిన పోస్టుల్లో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో 44 ఖాళీలు, ఎస్సీ అభివృద్ధి శాఖలో 30 ఖాళీలు ఉన్నాయి. గ్రూప్-4 నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ పోస్టులకూ అర్హులే.
ఏఎస్‌వో పోస్టులకు సెప్టెంబరు 2న, వీఆర్వో పోస్టులకు సెప్టెంబరు 16న రాతపరీక్షలు నిర్వహించారు. గ్రూప్-4 పోస్టులకు సంబంధించి అక్టోబరు 7న రాతపరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షలో విజయం సాధిస్తే పే స్కేల్: రూ. 16,400 నుండి రూ.49,870 వరకు లభించనుంది.
గ్రూప్-4 హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?
- అభ్యర్థులు www.tspsc.in అనే వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
- అక్కడ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- ఓ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి 'గో' బటన్‌పై క్లిక్ చేయండి.
- చివరగా, వచ్చిన హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
గమనిక: గ్రూప్ 4 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ: 6 అక్టోబర్ 2018 అని తెలిసింది.