Bus Stuck in Flood Water Near Mulugu: హైదరాబాద్ నుంచి ములుగు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ములుగు సమీపంలో ఘట్టమ్మ ఆలయం, జాకారం మధ్య వరదలో చిక్కుకుంది. ఇక్కడ రహదారిపై వరద తాకిడి అధికంగా ఉండటంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయి ఆగిపోయింది. బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు వరదల్లో చిక్కుకోవడం, బస్సు చుట్టూ భారీగా వరద నీరు ఉండటంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆర్తనాధాలు చేయసాగారు. బస్సులో సీట్ల కంటే పై ఎత్తులో వరద నీరు వచ్చి చేరింది. మమ్మల్ని రక్షించండి అంటూ బిగ్గరగా కేకలు వేయసాగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది అని సమాచారం అందుకున్న పోలీసులు.. ములుగు జిల్లా అధికార యంత్రాంగం అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్పంచుకున్నాయి. 


ఒకవేళ బస్సు పంట పొలాల్లో ఆగకపోయి ఉంటే ప్రమాదం తీవ్రత అధికంగానే ఉండేదని.. కానీ అదృష్టవశాత్తుగా బస్సు పంట పొలాల్లో కూరుకుపోవడంతో బస్సు వరద నీటిలో మరింత ముందుకు కొట్టుకుపోకుండా అక్కడే ఆగిపోయింది. ఫలితంగా ఎవ్వరికీ ఎలాంటి హానీ కూడా జరగలేదని తెలుస్తోంది. ములుగు చుట్టు పక్కల కొండ ప్రాంతాలు అధికంగా ఉండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగానే హైదరాబాద్ నుండి ములుగు వెళ్లే రహదారి సైతం వరద నీటితో బ్లాక్ అయింది.