ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ఇంట్లో పాలేర్లు కాదు: ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి
కార్మికులను డిస్మిస్ చేసి కొత్తవాళ్లను తీసుకుంటే ఊరుకోం: ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని.. ప్రస్తుతం విధుల్లో ఉన్న 1200మంది కార్మికులు మినహా మిగతా సిబ్బందిపై వేటు వేయడానికే ప్రభుత్వం సిద్దమైందని సీఎం కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన ఆర్టీసి కార్మికులను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు మీ ఇంట్లో పనిచేసే పాలేర్లు కాదన్న సంగతి గుర్తుంచుకుంటే బాగుంటుందని కేసీఆర్‌కు హితవు పలికారు. తెలంగాణ ఇంకా మీ గులాంగిరీ కాదు.. జాగిరి కాదు అంటూ ఆగ్రం వ్యక్తంచేశారు. సమ్మెలో పాల్గొన్నారనే కారణంతో కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్తవాళ్లను తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టిన అశ్వద్ధామ రెడ్డి... రాష్ట్రంలో బీజేపీ తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కొత్తగా చేరేవాళ్లను కూడా ఏ యూనియన్‌లో చేరవద్దన్న షరతు విధించడం నియంత్రుత్వం కాక ఇంకేమవుతుందన్నారు. సిబ్బంది కార్మిక యూనియన్స్‌లో చేరరాదన్నప్పుడు.. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మాత్రం ఎందుకు అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.