BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
BRS-BJP Alliance: తెలంగాణ ఎన్నికలకు దగ్గరపడ్డాయి. మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రచారం హోరెత్తుతోంది. హంగ్ ఏర్పడుతుందనే వార్తల నేపధ్యంలో బీఆర్ఎస్-బీజేపీ పొత్తు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
BRS-BJP Alliance: తెలంగాణ ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. హంగ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని కొందరు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉండవచ్చనే పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. కాంగ్రెస్ , బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రచారం తీవ్రతరం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. చాలా వరకూ సర్వేలు కాంగ్రెస్ పార్టీకు పట్టం కడుతుంటే మరి కొన్ని బీఆర్ఎస్‌దే విజయం అంటున్నాయి. ఇంకొన్ని సర్వేలు మాత్రం హంగ్ ఏర్పడవచ్చనే సంకేతాలిస్తున్నాయి. ఒకవేళ హంగ్ వాతావరణమే ఏర్పడితే కాంగ్రెస్-బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్-బీజేపీ పొత్తు అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. ఈ క్రమంలో ఉన్న అవకాశం బీఆర్ఎస్-బీజేపీ మాత్రమే. అందుకే తెలంగాణలో హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఏర్పడవచ్చనే వార్తలు గట్టిగా విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని అమిత్ షా ఆరోపించారు. ఈసారి బీజేపీకు అవకాశమిస్తే మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను తొలగించి ఆ 4 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామన్నారు.కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల్లో నిరాశ నెలకొందన్నారు. ప్రభుత్వం మొత్తం అవినీతిమయమైందన్నారు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఫాంహౌస్ లో కాకుండా సచివాలయంలో ఉండాలని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలో రాగానే ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామన్నారు.
ఇక బీఆర్ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో రాజకీయంగా లేక సిద్ధాంతపరంగా ఎలాంటి పొత్తు ఉండదన్నారు. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించిందన్నారు. బీఆర్ఎస్- బీజేపీ పొత్తు వార్తల్ని కొట్టిపారేశారు.
Also read: KTR: ఫేక్ వీడియోలు వైరల్ కావొచ్చు: మంత్రి కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook