ఫీజుల విషయంలో టి.సర్కార్ కు రాములమ్మ వార్నింగ్ !!
విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలను నియంత్రించడంలో టి సర్కార్ విఫలమైందని టి.కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు
విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థలను నియంత్రించాలని టి.కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి డిమాండ్ చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ విద్య పేరుతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్ధల అరాచకాలను కట్టడి చేసే విధంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడం హర్షనీయమన్నారు. ఇప్పటికైనా విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై టి.సర్కార్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మేల్కొంటే సరి..లేదంటే పోరుబాటే
విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలను నియంత్రించడంలో టి సర్కార్ విఫలమైందని టి.కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు.ఈ విషయంలో మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని...విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫీజుల నియంత్రణ కమిటీలకు స్వేచ్ఛగా పనిచేసేందుకు అవకాశమివ్వాలన్నారు. అదే సమయంలో కమిటీ సభ్యులు ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో టి సర్కార్ ఆలసత్వం ప్రదర్శిస్తే ఖబర్దార్ అంటున్న విజయశాంతి..అవసరమైతే పోరుబాట పడతానని విజయశాంతి హెచ్చరించారు.
కమిటీ సూచన మేరకే ఫీజు వసూలు
తెలంగాణలోని పలు ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్ధుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతన్న నేపథ్యంలో పేరేంట్స్ అసోషియేషన్ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఫీజుల నిర్ణయించే అధికారం... నియంత్రణ కమిటీకే ఉంటుందని స్పష్టం చేసింది. కమిటీ సూచన మేరకే కాలేజీలు యాజామాన్యాలు విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో విజయశాంతి ఈ మేరకు స్పందించారు.