సినీ నటి, మెదక్ మాజీ ఎంపి విజయశాంతి ఇకపై కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించబోతున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మూడేళ్లు గడిచినా ఆమె ఇప్పటికీ ఆక్టివ్ గా ఏ పార్టీ కార్యక్రమాలలో కనిపించడం లేదు. 


ఇదిలా ఉండగా 2019 ఎన్నికల్లో సినీగ్లామర్ ను ఉపయోగించాలని టీకాంగ్రెస్ అనుకుంటోంది. అందుకే రాబోయే ఎన్నికలకు ఆమె ఇమేజ్ ను వాడుకోవాలని భావిస్తోంది. అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపిసి) దక్షిణ భారత సమన్వయకర్త, మాజీ మంత్రి జె.గీతారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో సమావేశం ముగిసిన అనంతరం పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయశాంతిని కలిసి కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారని తెలుస్తోంది. చురుగ్గా  పాల్గొనడానికి ముందుకు వస్తే పార్టీ ప్రచార బాధ్యతను పూర్తిగా అప్పగిస్తామని కుంతియా ఆమెతో అన్నట్లు సమాచారం. టీ కాంగ్రెస్ కు దూరమైన వారిని తిరిగి ఆహ్వానించేందుకు టీపీసీసీ నడుం బిగించింది. రేవంత్ రెడ్డి, సీతక్క కాంగ్రెస్‌లో చేరికతో  ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఇలానే మరికొందరు చేరి, సినీగ్లామర్ తోడైతే  2019 ఎన్నికల్లో విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.