తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలు, వడగండ్లు, ఉరుములతో కూడిన వర్షాలు జోరుగా పడడంతో రాజధానిలో రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షంనీరు చేరడంతో ప్రజలు నానాహైరానా పడాల్సి వచ్చింది. నగరంలో చాలాచోట్ల గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి చెట్లు, కొమ్మలు విరిగిపడగా.. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు వర్షానికి పలు ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్, బేగంపేట, అబిడ్స్‌, కార్ఖానా, మారేడుపల్లి, పాతబస్తీ, సికింద్రాబాద్‌, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు గంటల్లో సగటున 2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మొత్తంగా 3 సెం.మీ.వాన పడిందని అంచనా. అలాగే రోడ్లపై హోర్డింగ్‌లు, చెట్లు కూలిపడటం, రహదారులపై వర్షపు నీరు నిలవడంతో నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వచ్చే 24 గంటల్లోనూ హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని, గాలివాన బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారాలు చెప్పారు.



 


ప్రభుత్వం అలర్ట్


అకాల వర్షాలపై ప్రభుత్వం తక్షణ చర్యలను ప్రారంభించింది. నష్టాలను అంచనా వేయడానికి అధికారుల బృందాన్ని తక్షణం పంపాలని ప్రభుత్వం కలెక్టర్లును ఆదేశించింది. జిల్లాలకు సంబంధించిన మంత్రులు సైతం పంట నష్టాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. తక్షణం వ్యవసాయ మార్కెట్లను పరిశీలించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం రైతులకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.